సబ్ టీక్ హై!!


మనం కొత్త మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని శక్తులు మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటాయి.
ముఖ్యంగా సంఘాల్లో చురుకుగా పని చేసే వాళ్ళని కొత్తలో టార్గెట్ చేస్తుంటారు, తర్వాత భవిష్యత్ లో కాళ్ళ బేరానికి కూడా వస్తారు.

అలాంటి ఒక సంఘటన నేను తహసిల్దార్ గా పని చేసే సందర్భంలో ఎదురైంది,

ఒక దశాబ్దం క్రితం నూతన ఉద్యోగ సంఘం ఆవిర్భావం జరిగింది, అప్పటికి ఉన్న ఉద్యోగ సంఘ నేతలు కొంత అవకతవకలకు పాల్పడడం, ఏకపక్షంగా, నియంతృత్వంగా ఉండడం వలన కొత్త సంఘం ఏర్పాటు అనివార్యం అయ్యింది. 

మాలాంటి వాళ్ళం అంతా కలిసి ఈస్ట్ గోదావరిలో సంఘాన్ని నిర్మించే పనిలో ముందు వరసలో ఉన్నాం..మేము యాక్టివ్ గా ఉండడం మా AO కంటపడింది, ఆయన పాత సంఘంలో కురు వృద్దుడు, భీష్మాచార్యుడు లాంటి వారు.

 ఈస్ట్ గోదావరి లోని అన్ని మండలాల్లో సంఘం లక్ష్యాలు వివరించి కమిటీలు వేయడం లాంటి వాటిల్లో చురుకుగా పని చేస్తున్నాం.

మా పని తీరు చూసి మా AO గారు కూడా పాత సంఘం అధ్యక్ష, కార్యదర్శులను పిలిచి సన్మానం చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో జరుగుతున్న పరిస్థితి నీ అంతా బాగా గమనిస్తూ ఉండేవారు.

రోజు రోజుకు కొత్త సంఘానికి ఆదరణ పెరగడం ఆయనకు ఎంత మాత్రం నచ్చలేదు, లో లోపల అసూయతో రగిలి పోతుండేవాడు, కలెక్టరేట్ లో ఎవరైనా కింది స్థాయి సిబ్బంది కొత్త సంఘంలో చేరితే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టాడు

ఒక రోజు వ్యూహాత్మకంగా నూతన సంఘంలో పనిచేస్తున్న సిబ్బందిని పిలిచి ఒక చర్చా కార్యక్రమం పెట్టాడు. చర్చను మొదలు పెడుతూనే నూతన సంఘం నాయకులను తిట్టడంతో స్టార్ట్ చేశాడు, కానీ మేమంతా ఆయన ఎంత కోపగించినా ఆయన లేవనెత్తిన ప్రతీ అంశాన్ని విడమరిచి చెప్పడం జరిగింది..అస్సలు కన్విన్స్ కాలేకపోయారు, మా పట్టుదల చూసి చివరికి అంతా ఒకటే, నేను అందరికీ సపోర్ట్ చేస్తాను అని చర్చ ను ముగించారు..

కానీ అతనిలో ఆ కోపాగ్ని చల్లారలేదు, ఏదో ఒకటి చేసి దీనికి అడ్డుకట్ట వేయాలి అని పరిపరి విధాలుగా ఆలోచించి ఒక ప్లాన్ తో ముందు కొచ్చాడు. 

కలెక్టరేట్ లో సూపరిండెంట్ గా ఉన్న నన్ను ఇరికించాలని పక్కా ప్రణాళిక వేశాడు, అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో దీపావళి పండుగ నాలుగు రోజుల ముందు కాకినాడ తినుబండారాల షాపులో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే టపాసుల షాపులు ఉండడంతో కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కావొద్దని చెప్పడం జరిగింది.

ఎలాగైనా నామీద ప్రతీకారం తీర్చుకోవాలని కాకినాడలో RI స్థాయి అధికారి చేసే పర్యవేక్షణను రాజమండ్రి కలెక్టరేట్ సూపరిండెంట్ గా ఉన్న నాకు డ్యూటీ చేసారు. అది కూడా రేపటి నుండి సెలవులు అయితే ఈరోజు మధ్యాహ్నం ఆర్డర్ పంపారు

సెలవులలో నేను కాశ్మీర్ వెళ్తున్నానని కూడా ఆయనకి ముందే తెలుసు, నేను ఫోన్ చేసి అడిగాను, బ్రదర్ అంటూ ఒక నవ్వు నవ్వి, వేరే ఆల్టర్నేట్ లేదు, కాకినాడ టౌన్ లో పని చేస్తున్న మా యూనియన్ ప్రెసిడెంట్ గారికి వేరే పని ఉందట, కాకినాడ రూరల్ లో ఉన్న మా సంఘ జనరల్ సెక్రటరీ తో ఒక సారి మాట్లాడు, ఆయన సమ్మతి ఇస్తే నీవు లీవ్ లో పోవచ్చు అన్నారు.

నాకు ముందు నుండి మా AO వ్యవహార శైలి తెలుసు కాబట్టి, పెద్దగా 
 షాక్ తినలేదు.అంతకు ముందు జరిగిన చర్చలో ఘోర పరాభవానికి , ఏదో ఒకటి చేస్తాడు అని ముందు ఊహించినదే.

ఏం జరుగుతుందో చూద్దాం అని మనసులో అనుకొని, ఒక సారి మా AO గారి యూనియన్ జనరల్ సెక్రటరీకి కాల్ చేసి మాట్లాడా.

మళ్ళీ ఒకసారి మా AO కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, దాంతో ఆయన ఫోన్ కి ఒక text మెసేజ్ పెట్టా, దానికి రిప్లై గా మా జనరల్ సెక్రటరీ సమ్మతి తెలిపాడా? అని జవాబిచ్చాడు..దాంతో ఒక నవ్వు నవ్వుకొని, నా కాశ్మీర్ టూర్ నీ రద్దు చేసుకొని ఆ కాకినాడ డ్యూటీకి బయల్దేరాను...

ఇవన్నీ వృత్తిలో భాగం, ఇలాంటివి జరుగుతుంటాయి.

ప్రముఖ సైకో అనలిస్ట్ ఎరిక్ ఎరిక్ సన్ ప్రకారం
సంకుచిత భావాలు కలిగి, హుందాతనం తెలియని వ్యక్తులు, నాయకుడిగా అసమర్డులు ఇలాగే ప్రవర్తిస్తుంటారు అని తన థియరీ లో వెలిబుచ్చారు.
సంఘాల్లో పని చేసే ప్రతీ ఉద్యోగి జీవితంలో ఏదో ఒక సారైనా ఇలాంటి సంఘటన ఎదురై ఉంటుంది.

ఇలాంటి వాటిని అసలు పట్టించు కోవద్దు, ప్రతీ ఆపదలో కూడా ఒక అవకాశాన్ని వెతుక్కోవాలి, చిన్న పిల్లల చేష్టలు అని నవ్వుకోవాలి, అలాంటి వారిని క్షమించాలి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం, మున్ముందుకు పోగలుగుతాం

మీ
కామేశ్వర రావు 
రిటైర్డ్ తహసిల్దార్ 

Comments